కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జీవిత, నట జీవిత ప్రయాణాలు రెండూ విలక్షణమైనవే. చిత్తూరులో మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, నటన మీద మక్కువతో చెన్నయ్ చేరి అంచలంచెలుగా ఎదిగారు మోహన్ బాబు. ఇవాళ ఆయన ఇటు చిత్రసీమలోనే కాదు అటు విద్యారంగంలోనూ తనదైన ముద్రను వేశారు. ఐదు వందలకు పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. సినిమా, రాజకీయ, విద్యారంగాలలో తనకెదురైన అనుభవాలను మోహన్ బాబు గత ఐదు సంవత్సరాలుగా గ్రంథస్థం చేస్తున్నారు. ఈ ఆత్మకథకు తనదైన శైలిలో ‘నా రూటే సపరేటు’ అనే నామకరణం చేసినట్టు తెలుస్తోంది. దర్శక రత్న దాసరి నారాయణ రావు ‘స్వర్గం – నరకం’ ద్వారా మోహన్ బాబును వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ప్రారంభమైన రోజుని మోహన్ బాబు ప్రత్యేకమైనదిగా భావిస్తుంటారు. అందుకే ఇప్పుడు తన ఆత్మకథను ఆయన జులై 4న విడుదల చేయాలని సంకల్పిస్తున్నట్టు సమాచారం. ఈ పుస్తకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేస్తారని తెలుస్తోంది.