మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక సినిమాల్లో నటించనంటూ అప్పట్లో ఓ స్టేట్‌మెంట్ కూడా ఇస్తే ఏదో కామెడీగా చెప్తున్నాడేమో అనుకున్నారు కానీ నిజంగానే దాన్ని అమలు చేస్తున్నాడు మనోజ్. ఇప్పుడు ఈయన హాయిగా టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలపై స్పందన తెలియజేస్తున్నాడు. ప్రత్యక్షంగా అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాడు పలు విషయాలపై చర్చిస్తున్నాడు. దానికితోడు వాళ్ల కష్టాలను కూడా పంచుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు మనోజ్.
పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తనకు ఎదురైన కష్టాన్ని ట్విట్టర్ వేదికగా మనోజ్‌తో పంచుకున్నాడు. సాయినాథ్ కల్యాణ్ అనే కుర్రాడు తను పవన్ కల్యాణ్ అభిమానినని.. జనసేన పార్టీ కోసం తిరిగానని చెప్పుకొచ్చాడు. తనకు పవన్ అంటే ప్రాణమని.. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు తన తండ్రికి సీరియస్‌గా ఉందని.. కానీ తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదని చెప్పుకొచ్చాడు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లాంటి వాళ్లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. మనోజ్ చూసి వెంటనే నీ వివరాలు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదంటూ ధైర్యం చెప్పాడు. మొత్తానికి సోషల్ మీడియాలో కష్టాన్ని చూసి కదిలిపోయాడు మనోజ్. ఈయన మంచి మనసుకు అందరినుంచి ప్రశంసల అందుతున్నాయి.