బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహాత్య కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనూహ్యంగా టాలీవుడ్ సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి రియాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగాలని వాదిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆదివారం #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ ఓ పోస్ట్ పెట్టారు. “రియా చక్రవర్తిని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాత దీనిపై స్పందించాలా? వద్దా? అని చాలా ఆలోచించాను.
కానీ ఇప్పటికే మీడియా ఆమెను రాక్షసిగా చిత్రీకరిస్తోంది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నారు. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే సమయంలో నిజం ఎలాగైనా బయటకు వస్తుందని నమ్ముతున్నా. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అన్ని రకాల దర్యాప్తు సంస్థలు సుశాంత్‌కు న్యాయం తీసుకువచ్చేందుకు పాటుపడుతున్నాయి. అప్పటివరకు మనమంతా సహనం పాటించాలి. ఇతరులను ద్వేషించడం మానుకోవాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె
కుటుంబంపై నిందలు వేయడం తగదు.
మీడియా వల్ల ఆమె కుటుంబం ఎంత బాధపడుతున్నారనేది నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ఇలాంటివి ఎదురైతే ఒక్కసారైనా నా సహచరులు నావైపు నిలబడాలి. నిజం బయట పడేంతవరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను” అని పేర్కొన్నారు. దీనికి రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందిస్తూ ‘గొప్పగా చెప్పారు’ అని ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ తాప్సీ కూడా రిప్లై ఇచ్చారు. “నాకు వ్యక్తిగతంగా సుశాంత్ పెద్దగా పరిచయం లేదు, రియా కూడా అంతగా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే.. నేరం నిరూపణ అవకముందే ఓ వ్యక్తిని దోషిగా నిలబట్టే ప్రయత్నం చేయడం తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించండి” అని ట్వీట్ చేశారు.
@sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends… stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H
— Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020