ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తుంది. ఇటువంటి సమయంలో కూడా ప్రజలను రక్షించటానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వానికి, ప్రజలకు తమ సహకారం అందిస్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు మంచు లక్ష్మి. ఈ మేరకు ఆవిడ ఓ వీడియో విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ.. ”హైదరాబాద్ సిటీ పోలీసులందరికీ పెద్ద సెల్యూట్. నిజంగా ఈ లాక్ డౌన్ లో మీరెంత కష్టపడి పని చేసారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 98 మంది పోలీసులు కరోనా బారినపడి కోలుకొని మళ్ళీ విధుల్లో పాల్గొన్నారని విన్నాను. వాళ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరే మా సూపర్ మ్యాన్స్, స్పైడర్స్ మ్యాన్స్.. హనుమాన్ రాముడు కృష్ణుడు అని పుస్తకాల్లో చదువుకున్నాం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు మాత్రం మీరే” అంటూ పోలీసులపై ప్రశంసలు కురిపించారు.
అంతేకాకుండా మా జాగ్రత్తల గురించి మా కోసం మీ ఫ్యామిలీస్ ని వదిలేసి బయటకొచ్చి మమ్మల్ని కాపాడుతున్న మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది తీరని ఋణం. మీరు త్వరగా రికవరీ అయి డ్యూటీలో జాయినై మరింత స్ట్రాంగ్ గా వర్క్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. అతి త్వరలో మనమంతా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే ”పోలీసుల కష్టాన్ని మంచు లక్ష్మి గుర్తించారు” అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.