ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో.. ‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుంది కదా! ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా నటిగా, హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడబోతోంది. ఈ మేరకు ఇటీవలే అతడితో నిశ్చితార్థం సైతం జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. అదే సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆమె తెలు చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది.