పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈక్రమంలో.. ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ మాట్లాడుతూ.. ”నుదిటిమీద గాయంతో ముఖ్యమంత్రి ఆసుపత్రికి వచ్చారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దాంతో నుదురు, ముక్కుకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది” అని తెలిపారు.
రక్తపోటులో హెచ్చుతగ్గులు ఆమె పరిస్థితికి కారణమై ఉంటాయా..? అని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ”ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు” అని శుక్రవారం ఉదయం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే మమత వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారా..? అనే దానిపై స్పష్టత లేదు.
తన ఇంటిలో మమత కిందపడ్డారని, ఆమె నుదిటికి తీవ్ర గాయం అయిందని నిన్న పార్టీ వర్గాలు ‘ఎక్స్’లో వెల్లడించాయి. ఆమె నుదిటి నుంచి రక్తం కారుతున్న ఫొటోను పోస్టు చేశాయి. ఆమెను వెంటనే ఎస్‌ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నాయి. మమతకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి గాయానికి కుట్లు వేశారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్ఛార్జి చేశారని తెలిపాయి. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమె తర్వగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఆకాక్షించారు.