మూవీ స్టార్స్ కాస్త టైమ్ దొరికొతే వెంటనే మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెట్స్ వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పలువురు హీరోయిన్లు అక్కడ హాట్‌హాట్ ఫొటోషూట్లు చేసి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే.. తాజాగా కరోనా నేపథ్యంలో భారత్ నుంచి పర్యాటకుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అక్కడి పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. దీంతో బాలీవుడ్ తారలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు సెలబ్రెటీలంతా సోషల్ మీడియాలో ఏ ఫొటోలు పంచుకోవాలి.. ఏ పోస్టులు చేయాలంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనవసరంగా టికెట్లు బుక్ చేశానంటూ బాధపడుతున్నట్లుగా మీమ్స్ కూడా తెగ సందడి చేస్తున్నాయి.