ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ వరదల్లో చిక్కుకున్నారు. లఘు చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆమె 35 మంది సభ్యులున్న బృందంతో కలిసి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అయితే గత కొన్నిరోజులుగా ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో మంజుతో పాటు మిగిలినవారంతా ఛత్రు అనే ప్రదేశంలో చిక్కుకుపోయారు. విషయం తెలిసి మండి జిల్లా యంత్రాంగం వారికి సాయం చేసేందుకు వెళ్లింది. అయితే చిత్రీకరణ పూర్తయ్యేవరకు అక్కడి నుంచి కదలమని మంజు చెప్పడం గమనార్హం.
‘వరదల కారణంగా మేం వెళ్లాల్సిన ప్రాంతంలోని రోడ్డు పాడైంది. మరమ్మతులు పూర్తయ్యాక మనాలి వెళ్లేందుకు మేం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఒకవేళ మాకు ఏదన్నా ప్రమాదం జరిగితే అందుకు ప్రభుత్వం, మండి జిల్లా యంత్రాంగం బాధ్యత వహించదు. మమ్మల్ని ఛత్రు ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిందిగా కొన్ని రోజుల నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ మా గురించి ఎలాంటి దిగులు అవసరం లేదు. ఏదన్నా జరిగితే మేమే బాధ్యత వహిస్తాం’ అని చిత్రబృందానికి చెందిన గంగారామ్ అనే వ్యక్తి వెల్లడించారు. మరోపక్క మంజు వారియర్ సోదరుడు వారిని క్షేమంగా తరలించాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ మంజు వారియర్‌తో పాటు మిగిలినవారు కూడా అక్కడి నుంచి రావడానికి సుముఖంగా లేరంటూ అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అయినప్పటికీ వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ఠాకూర్ తెలిపారు. వరదలు, కొండచరియల కారణంగా ఇప్పటివరకు దాదాపు 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో హిమాచల్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.