తమిళ స్టార్ హీరో విజయ్‌పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ సూపర్‌స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని చెప్పాలి. వాళ్లు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ‘మధుర రాజా’, ‘లూసీఫర్’ వంటి చక్కటి చిత్రాలు రావడానికి కారణం వారే. ప్రతి చిత్ర పరిశ్రమ.. అక్కడి సూపర్‌స్టార్స్‌ను బట్టి రాణిస్తుంది. మాలాంటి (క్యారెక్టర్ ఆర్టిస్టులు) వాళ్లు అలాంటి సూపర్‌స్టార్స్ వల్ల జీవించగలుగుతున్నారు. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మరోలా ఉంటాయి. విజయ్ సూపర్‌స్టార్ అని ప్రజలు ఆయన్ను ఇష్టపడుతుంటారు. కానీ నిజానికి ఆయన సూపర్ నటుడేమీ కాదు. ఆయన్ను స్టార్‌డమ్ నడిపిస్తోంది. నాపరంగా మాత్రం కమల్ హాసన్ మంచి నటుడు, సూపర్‌స్టార్’ అని సిద్ధిఖీ అన్నారు.
దీంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది. సిద్ధిఖీపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో వరుస కామెంట్లు చేస్తున్నారు. విజయ్ గొప్ప నటుడని, ఆయన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు.