బాలీవుడ్ నటి మలైకా అరోరా తననెవరైనా ఐటెం గర్ల్ అంటే వారి పళ్లు రాలగొడతానని అంటున్నారు. ‘దిల్ సే’ చిత్రంలోని ‘ఛయ్య ఛయ్యా..’ అనే ప్రత్యేక గీతంలో మలైకా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘మున్నీ బద్నామ్’, ‘కెవ్వు కేక’ వంటి ఎన్నో పాటల్లో మెరిశారు. నాలుగు పదుల వయసులోనూ ఆమెకు ప్రత్యేక గీతాల్లో నర్తించే అవకాశం వస్తోంది. అయితే తన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు ‘ఐటెం గర్ల్’ అని సంబోధిస్తుంటారట.
ఈ విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. దర్శకులు, నిర్మాతలు సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండేలా చూసుకుంటున్నారు. కానీ నా ఆలోచనా విధానం వేరు. ఒక నటీమణికి ప్రత్యేక గీతంలో నర్తించడం ఇష్టంలేనప్పుడు అందుకు ఒప్పుకోకపోవడమే మంచిది. అయితే ఆ పాటలను పూర్తిగా నిషేధించాలని నేను చెప్పను. మన సినిమాలకుండే ప్రత్యేకతే అది. నేను ఏదన్నా పాటలో నర్తిస్తే దాన్ని అందరూ ఐటెం సాంగ్ అంటుంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఒకవేళ నన్ను ఎవరైనా ‘ఆమె ఐటెం గర్ల్’ అని అంటే.. వారి పళ్లు రాలగొడతాను. నాకు నచ్చిన విధంగానే నేను ప్రత్యేక గీతాల్లో నర్తించాను. ఎవరి బలవంతం మీదో నేను వాటిని ఎంపిక చేసుకోలేదు. నాకు అవి సౌకర్యంగానే ఉన్నాయి. ఒకవేళ నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. ఇలాంటి పాటల్లో ఎలాంటి అసభ్యత ఉండదు. సినిమాలో కాస్త ఫన్ ఉండాలంటే ఇలాంటి పాటలు ఉండి తీరాల్సిందే’ అని వెల్లడించారు మలైకా.’పటాఖా’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మలైకా చివరి సారిగా నర్తించారు. త్వరలో ఆమె బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.