‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి ఇప్పుడు నాని హీరోగా
‘మజ్ను’ అనే చిత్రాన్ని రూపొందించాడు విరించి వర్మ. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు
రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. దర్శకుడు విరించి వర్మ విలేకర్లతో ముచ్చటించారు..
నేపధ్యం..
మాది భీమవరం. నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు. నేను హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేశాను.
సినిమాల మీద మక్కువతో మదన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ తరువాత రమేష్ వర్మ గారి వద్ద పబ్లిసిటీ డిజైనర్ గా పని చేశా.. రామ్మోహన్ గారితో కలిసి ఉయ్యాల జంపాలా సినిమా చేసే అవకాశం వచ్చింది. అలా దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది.
డిఫరెంట్ డిఫికల్ట్ లవ్ స్టోరీ..
ఒక అబ్బాయి, ఇద్దరి అమ్మాయిల మధ్య జరిగే కథే ఈ చిత్రం. ట్రైయాంగల్ లవ్ స్టోరీ అని చెప్పలేను. ఇదొక డిఫరెంట్ డిఫికల్ట్ లవ్ స్టోరీ. సినిమాలో హీరో ఇద్దరమ్మాయిలను ప్రేమిస్తాడు. అలానే ఇద్దరమ్మాయిలు హీరోను ప్రేమిస్తారు. ఇప్పటివరకు మజ్ను అంటే విషాద ప్రేమ అనే అనుకుంటున్నారు. ఈ సినిమా తరువాత దానికి అర్ధం మారిపోతుంది.
నాని లో సీరియస్ యాంగిల్..
ఆదిత్య అనే పాత్రలో నటించాడు. ఎమోషన్స్ ను కామెడీ వే లో ప్రెజంట్ చేయగలిగే హీరో ఆయన. తన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఈ కథ రాసుకున్నప్పుడు నాని అయితేనే బావుంటుందని అనుకున్నాం. ఇప్పటివరకు నానిని ఫన్ తరహా పాత్రల్లోనే చూశారు. ఈ సినిమాలో ఫన్ ఉంటూనే తనలో ఒక సీరియస్ యాంగల్ ను కూడా చూపించబోతున్నాం.
అవే హైలైట్స్..
నాని నటన, హీరో హీరోయిన్స్ మధ్య నడిచే కెమిస్ట్రీ, కథనం, గోపిసుందర్ మ్యూజిక్ ఇవన్నీ సినిమాకు ప్లస్ అవుతాయి.
ఆ హీరో అతిథి పాత్ర..
ఏ సినిమాలో రాజ్ తరుణ్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
వారి ప్రభావం నాపై ఉంటుంది..
బాపు, భారతీరాజా, బాలచందర్, కె.విశ్వనాథ్, వంశీ వంటి దర్శకులంటే నాకు చాలా ఇష్టం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. ఈ దర్శకుల ప్రభావం నాపై ఉంటుంది.
ఎమోషన్స్ ఉన్న సినిమాలే చేస్తా..
ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమాలకు బాగా కనెక్ట్ అవుతాను. నా సినిమాల్లో
వాటితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను బ్యాలన్స్ చేసుకునేలా చూసుకుంటాను. భవిష్యత్తులో
కూడా నా నుండి ఈ తరహా చిత్రాలే వస్తాయి.
రాజమౌళి గారు కనిపిస్తారు..
ఈ సినిమాలో నాని, రాజమౌళి గారి ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు.
అతని ప్రొఫెషన్ కు కథకు చిన్న కనెక్షన్ ఉంటుంది. బాహుబలి టీంను చూపించట్లేదు కానీ బాహుబలి సెట్ లో రాజమౌళి గారిని చూపిస్తున్నాం.