సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయాలనుకున్న సినిమా ఒక్కరోజు ముందుగా జనవరి 11న విడుదల చేయబోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో హీరోయిన్ రష్మిక కాగా ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 12న అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. దీంతో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొని ఉంది. ఇరు చిత్రాల నిర్మాతలకు నష్టం కలిగించేది కావడంతో తెలుగు చిత్ర నిర్మాతల సంఘంలో దీనిపై చర్చించారు. ఇరు చిత్రాల నిర్మాతలు అనిల్ సుంకర, చినబాబు తేదీల మార్పునకు అంగీకారం తెలపడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న, ‘అల.. వైకుంఠపురములో..’ జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఒకప్పటి లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి పాత్రలో కనిపించబోతున్నారు.