సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో నిన్న (మంగళవారం) గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘సినిమాకు వందశాతం పనిచేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్‌బాబు ఒక్కరే అని చెప్పడం అతిశయోక్తి కాదు. అతడు, ఖలేజా టైమ్‌లో మహేష్ బాబు ఎలా ఉన్నాడో.. ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. పర్‌ఫార్మెన్స్‌లో కూడా అంతే నూతనత్వం కనిపిస్తున్నది.
ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం’ అన్నారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ.. ‘గత 25 ఏండ్లుగా మీరు చూపిస్తున్న అభిమానాన్ని మరచిపోలేను. ప్రతి ఏడాది అది పెరిగిపోతున్నది. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ సీజన్‌లో మా సినిమా రిలీజైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొట్టబోతున్నాం’ అన్నారు మహేష్‌బాబు.
‘త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్రెండ్‌కంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాను. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా పర్‌ఫార్మెన్స్ విషయంలో ఓ మ్యాజిక్ జరిగిపోతుంది. అతడు, ఖలేజా సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే జరిగింది.
ఈ సినిమాలో కొత్త మహేష్‌బాబుని చూడబోతున్నారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు థియేటర్లు బద్దలైపోతాయి. నాన్నగారు నా సినిమా చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించేది. ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేవాడిని. ఇప్పుడు ఆ వివరాలన్నీ మీరే నాకు చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. సింగిల్ స్క్రీన్స్‌లో 65 రూపాయలు, మల్లీఫ్లెక్స్‌లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలోని 23చోట్ల బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీటితో పాటు ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.