ఏ రోజుకైనా సినిమాయే ఈ సమాజాన్ని మారుస్తుంది.. సినిమాయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది’ అంటున్నారు ప్రముఖ నటుడు నరేష్. ఆయన నటిస్తున్న సినిమా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’. ‘తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడు’గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నరేష్ నటిస్తుండగా తనికెళ్ల భరణి, వాహిణి, మహర్షి రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబ్జీ దర్శకుడు. ఎమ్. సతీష్‌బాబు నిర్మాత. నవంబరు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో రఘుపతి వెంకయ్య నాయుడు మచిలీపట్నం నుంచి చెన్నై చేరుకోవడం, సినిమాలు తీయడం తదితర అంశాల్ని ఇందులో చూపించారు. ‘సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్ర రేఖ. సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస..’ అని రఘుపతి వెంకయ్య నాయుడుగా నరేష్ చెప్పడం హైలైట్‌గా నిలిచింది.