కరోనా నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. ఇంట్లోనే ఉండి అభిమానులతో పాటు అందరికీ సందేశాలు ఇస్తున్నాడు. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో అంతా జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు మహేష్ బాబు. ప్రభుత్వం షూటింగ్ చేసుకోడానికి అనుమతి ఇచ్చినా కూడా ముందు వద్దని చెప్పిన హీరో కూడా మహేష్ బాబే. ఆయన తర్వాతే అంతా వారించడం మొదలు పెట్టారు. తన సర్కారు వారి పాట సినిమాను డిసెంబర్ నుంచి పట్టాలెక్కించాలని దర్శక నిర్మాతలకు సూచించాడు మహేష్. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మహేష్ బాబు చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. లాక్‌డౌన్ సమయంలో కొంత మేరకు నియంత్రణ ఉన్నా ఇప్పుడు అసలు లేదని చెప్పాడు మహేష్. లాక్‌డౌన్ సడలించిన తర్వాతే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ కఠిన సమయంలో అంతా తమ వంతు బాధ్యతగా ఉండాలని.. మన కుటుంబానికి మనమే అండ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నాడు మహేష్ బాబు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాలని కోరాడు మహేష్ బాబు.
ఇప్పటి వరకు ఎవరైనా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని సూచించాడు. మన చుట్టు పక్కల నమోదయ్యే కరోనా కేసులను సూచిస్తూ ఈ యాప్ మనల్ని అప్రమత్తంగా ఉంచుతుందని తెలిపాడు. అంతేకాదు అత్యవసర వైద్య సదుపాయాలను కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపాడు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలని మహేష్ బాబు అభిమానులతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసాడు. త్వరలోనే మంచి రోజులు వస్తాయంటున్నాడు మహేష్ బాబు.