టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ రోజు (ఆగస్టు9) 45 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబు బర్త్ డే ట్వీట్స్‌తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. #HBDMaheshBabu ట్యాగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు మహేష్. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్.. 1999 లో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా మారాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాతో మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఒక్కడు మహేష్ కు స్టార్ డమ్ తెచ్చింది. అదే ఏడాది ‘నిజం’ సినిమాతో మహేష్ బాబు ఉత్తమ నటుడిగా మొదటి నంది పురస్కారం అందుకున్నాడు. వెంటవెంటనే అతడు, పోకిరి వంటి హిట్స్ అందుకున్న మహేష్ కు మళ్ళీ దూకుడు సినిమాతో హిట్ అందుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక ఆ తర్వాత నుండి తీసిన 10 సినిమాల్లో 7 సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ తనకు ఎవరూ సరిలేరు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ తో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ తన అభిమానులకు.. కరోనా కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.