సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ కృష్ణ, మహేశ్ అభిమానులకు ఈరోజు పెద్ద పండుగ. మీకు అందరికీ ఒక్క పండుగ అయితే.. మహేశ్‌కు ఇది 25వ సినిమా కాబట్టి.. 25 పండుగలు ఒకేసారి చేసుకున్నట్లు అన్నారు.
మహేష్ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా… నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో.. ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నాను అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన ఈ ప్రయత్నం ప్రజలకు, సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉందని కొనియాడారు. మహేశ్‌ను సీఈవోగా, రైతుగా, రుషిగా చూపించారని.. సంపాదించింది చివరికి రైతుకు ఇవ్వాలనే సందేశాన్ని అద్భుతంగా చెప్పారని అన్నారు. పూజా హెగ్డే గొప్పగా నటించారని, నరేష్ కామెడీనే కాదు సీరియస్ పాత్రలు కూడా చేస్తావని నిరూపించావు. మీ నాన్న ఉంటే చాలా సంతోషించేవారని అన్నారు.
మహేశ్ హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు. సూపర్‌స్టార్ కృష్ణ నిర్మాత. దత్ ప్రొడక్షన్‌లో చేయమన్నారు. ఆ సినిమాలో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మహేశ్ నిన్ను నేను పరిచయం చేయడం గర్వంగా ఉంది. ఏప్రిల్ 28న వచ్చిన అడవి రాముడు, పోకిరి, బాహుబలి రికార్డులు సృష్టించాయి. మే 9న వచ్చిన జగదేక వీరుడు అతిలోకసుందరి, మహానటి, మహర్షి హిట్ అయ్యాయి. ఇక నుంచి మే 9ని మహర్షి డేగా పిలుస్తారు అన్నారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. మహేశ్.. నాది చిన్న విన్నపం. రాజకుమారుడు షూటింగ్‌లో నన్ను మామయ్య, మామయ్య అనేవాడివి. ఇప్పుడు నువ్వు వేదికపైకి వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పినప్పుడు నన్ను రాఘవేంద్రరావు గారు అనొద్దు.. మామయ్య అను అని చెప్పారు.