దర్శకుడు వంశీ పైడిపల్లి.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసినప్పుడు తనకు ఒళ్లు గగుర్పొడించిందని అంటున్నారు. ఆయన తెరకెక్కించిన ‘మహర్షి’ చిత్రం గురువారం విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి టాక్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా సినిమాలు విడుదలైనప్పుడు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎప్పుడూ ఫోన్లు రాలేదు. కానీ ఈసారి ‘మహర్షి’ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. వినోదంతో పాటు ఓ సందేశాత్మక సినిమాను అందించారంటూ ఎంతో మంది ఫోన్ చేసి చెప్పారు. సినిమాలో ద్వితీయార్ధం సాగదీతగా అనిపించిందని అంటున్నారు. సినిమాలో అదొక్కటే ఆలోచించాల్సిన విషయం కాదు. క్లైమాక్స్ బాగుందని అంటున్నారు. ప్రథమార్ధం, ద్వితీయార్ధం లేకుండా క్లైమాక్స్ వచ్చేయదు కదా. దిల్‌రాజు చెప్పినట్లు మొత్తానికి ప్రేక్షకుడు సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నాడన్నదే ముఖ్యం. నాకు ఇప్పటివరకు వచ్చిన ఫోన్ కాల్స్‌లో చిరంజీవి గారి నుంచి వచ్చిన ఫోన్ ఎంతో ప్రత్యేకం. ఉదయం నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. దాంతో ఎవరు చేస్తున్నారో అర్ధంకాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు ఆయన అని తెలీక ‘హలో ఎవరు’ అన్నాను. ‘నేను చిరంజీవి’ అనగానే నాకు ఒళ్లు గగుర్పొడిచింది. సినిమా గురించి ఆయన ఐదు నిమిషాలు మాట్లాడారు. అది నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగాం. ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. ‘వంశీ ఇదే నా నెంబర్ సేవ్ చేసుకోండి’ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘మహేశ్‌బాబు కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘మహర్షి’ నిలిచింది. సినిమా ఇంతటి విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించాం. ఇందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సినిమా బాగుంటే అదే వసూళ్ల పరంగా ముందుకెళుతుంది. సాధారణంగా సినిమాను గురువారం విడుదల చేస్తే శుక్రవారం అంతగా కలెక్షన్లు రాబట్టదేమోనని అనుకున్నాం. కానీ అన్ని థియేటర్లు దాదాపు హౌస్‌ఫుల్ అయ్యాయని తెలిసి చాలా సంతోషించాం. మహేశ్ సినిమాలో ఇది ఓ మైలురాయిలాంటి చిత్రంగా నిలిచిపోతుందని కచ్చితంగా చెప్పగలను. రివ్యూల్లో రాసినవన్నీ ప్రేక్షకుడికి అవసరం లేదు. నాకు మొత్తానికి సినిమా ఎలా ఉంది? అన్నదే ముఖ్యం’ అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏదో ఒక సినిమా తీసేశాం అని కాకుండా హృదయాలను తాకే సినిమాను తెరకెక్కించారు. అందుకు ముందు దర్శకుడు వంశీని మెచ్చుకోవాలి. అలాగే మహేశ్ సర్ కూడా.. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక అంశాల నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా కోసం పని చేస్తున్నంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను. మా అమ్మ సినిమా చూసి వంశీకి ఫోన్ చేసి ఏడ్చేశారు. మా చెల్లి కూడా చాలా ఉద్వేగానికి లోనైంది. మహేశ్ 25వ సినిమాకు నేను సంగీతం అందించారు. ఎన్టీఆర్ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం 2’, చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150′ సినిమాలకు కూడా నేనే సంగీతం అందించాను. ఇవన్నీ నాకు ల్యాండ్‌మార్క్ చిత్రాలు. అందరికీ ధన్యవాదాలు’