ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై రాజకీయ నాయకులు, అభిమానులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారా అనే ఇప్పటికే ఎవరికి తోచినది వారు చెబుతుంటే మరోవైపు కొందరు జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు పూజలు చేస్తున్నారు. కొందరు అంజనాలు వేయిస్తున్నారు. కొందరు తాంత్రిక పూజలు చేయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల గెలుపు, ఓటములు తెలుసుకోవడానికి కార్యకర్తలు తాంత్రిక పూజలు చేసిన వీడియో వైరల్ గా మారింది. వెంకటగిరిలో టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడో తెలుసుకోవడానికి కొందరు మంత్రగాళ్లను ఆశ్రయించారు.
మహిళలతో సహా కొందరు వ్యక్తులు పూజలో పాల్గొన్నారు. చెప్పుకు పూజలు చేసిన అనంతరం మంత్రగాడు.. గెలిచే పార్టీ పేరు చెప్తున్న మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ పేర్లు పలుకుతూ పూజలు చేసి.. గెలిచే పార్టీ పేరు అభ్యర్థి పేరు చెప్పగానే చేతి వేళ్ళ చుట్టూ చెప్పు తిరుగుతుందని మంత్రగాడు మాయచేసాడు. దీనితో తమ పార్టీ యే గెలుస్తుంది అంటూ వీడియోని కార్యకర్తలు వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈనెల 11న పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు, ఫలితాలకు మధ్య చాలా రోజుల గ్యాప్ ఉండడంతో కార్యకర్తలు ఉత్సాహం ఆపుకోలేకపోతున్నారు. కొందరు జ్యోతిష్యులను సంప్రదిస్తుంటే, మరికొందరు ఇలాంటి మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు.