గాడ్సేపై వ్యాఖ్యల వివాదంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఊరట లభించింది. మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్ కమల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కమల్ హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా 76 ఫిర్యాదులు రాగా.. రెండు కేసులు నమోదయ్యాయి.
అయితే, ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో కమల్ హాసన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తీవ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పే ప్రయత్నంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు కమల్ పేర్కొన్నారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను అంగీకరించింది. కమల్‌ను అరెస్టు చేయకుండా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.