ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ చిక్కుల్లో పడ్డారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. 2012 సంవత్సరంలో బ్రిటన్ కు చెందిన ఒక సంస్థతో రహ్మాన్ 3.47 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం అప్పట్లోనే రహ్మాన్ ఖాతాలోకి వచ్చాయి. కాని అందుకు సంబంధించిన ఆయన చెల్లించాల్సిన ట్యాక్స్ విషయంలో మాత్రం ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే పలు సార్లు ఆయనకు నోటీసులు పంపినా కూడా స్పందించక పోవడంతో ఇప్పుడు హై కోర్టును ఆశ్రయించినట్లుగా ఇన్ కం ట్యాక్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఏఆర్ రెహ్మాన్‌ను ఆదేశిస్తూ శుక్రవారం నోటీసులు జారీచేసింది.