కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. పన్నుకట్టనందుకు గాను రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దాదాపు 7.95 కోట్ల విలువైన కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ విజయ్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
రీల్ హీరోలే ఇలా పన్ను కట్టేందుకు వెనకాడటమేంటని ప్రశ్నించింది. లక్ష జరిమానాను రెండు వారాల్లోగా తమిళనాడు సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని ఆదేశించింది. సినిమాల్లో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు, అవినీతి మీద యుద్ధం ప్రకటించినట్లు చూపిస్తారు. కానీ నిజజీవితంలో నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా, సరైన సమయానికి పన్ను కట్టేవాడే అసలైన హీరో’ అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.