పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసం ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా ‘ఆది పురుష్’ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్తా గజానన్ నటిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఈసినిమా హాట్ టాపిక్‌గా మారింది. వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయని.. ప్రతిష్టాత్మక సినిమాని అని చెప్పి నాసిరకం కార్టూన్ సినిమా అందిస్తున్నారంటూ మేకర్స్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీజర్‌తో హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయంటూ.. రాజకీయ నాయకులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదురుతోంది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ఆదిపురుష్ సినిమాపై అభ్యంతరాలు ఉన్నాయి. హనుమంతుడికి లెదర్ జాకెట్ తొడిగారు. హిందువుల నమ్మకాలు – మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఇందులో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వాటిని తీయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం” అని నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.
ఇప్పటికే బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్ కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాల్మీకి రాసిన రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి దర్శకుడు ఓం రౌత్ అధ్యయనం చేయలేదనిపిస్తోందని అన్నారు. టీజర్ లో రావణుడి పాత్ర నీలి కళ్లతో.. లెదర్ జాకెట్ వేసుకున్నట్లు చూపించారని మండిపడ్డారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదని.. మన దేశ ప్రజల నాగరికతను కాపాడే రామాయణం ఆధారంగా సినిమా తీస్తూ.. రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉందని మాళవిక అవినాష్ ఫైర్ అయ్యారు. ఒక శివ భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు. అయితే ఆదిపురుష్ లోని రావణుడు మాత్రం టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు. మన రామాయణం లేదా చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి అని మాళవిక అన్నారు.