మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామాలు చేయొద్దని, పంపిన లేఖలు వెనక్కి తీసుకోవాలని తాము ఇప్పటికే ఆ సభ్యులను కోరినప్పటికీ వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదిస్తున్నానని తెలిపారు. మరోవైపు, ఈ 11 మంది స్థానాల్లో తన ప్యానల్ నుంచి ఓడిపోయిన 11 మంది సభ్యుల్ని తీసుకునే ఆలోచనలో విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం జరిగిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. విష్ణు ప్యానల్ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆనాడే ప్రకటించిన విషయం తెలిసిందే.