సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కన్నా ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం మహిళలను అవమానించేలా ఉంది అని నటి శ్రీరెడ్డి తెలిపింది. తాజాగా హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్‌లో విలేకరుల సమావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఆర్థిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్ మధ్య వివాదం చెలరేగడం, తర్వాత రెండు రోజులకే సమస్య పరిష్కారమైందని చెప్పడం చూస్తుంటే, ఆర్థిక అంశాలే కీలకమైనవన్న అభిప్రాయం కలుగుతోందన్నారు.
ఎంపీ కవిత కూడా మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించి మాట్లాడతారు గాని, మహిళల అంశాలను పట్టించుకోలేకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు. మరో నటి అపూర్వ మాట్లాడుతూ నిరసన చేపట్టిన కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. మహిళా సంఘం నేతలు సంధ్య, కె.రమ (పీవోడబ్ల్యు), ఎస్.ఎల్.పద్మ (ఐఎఫ్‌టీయూ), తేజస్విని, సుజయ, తదితరులు మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో బాధితులే ఇబ్బందులు చెప్పుకున్నా ఓదార్పు లేకపోయిందన్నారు.