‘మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్’ ఎన్నికల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా మా ఎన్నికలు జరగకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారంటూ నటి హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆడియో టేప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇక ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు.
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరు కూడా స్పందించారు. స్వయంగా ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేశారు. సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అభిప్రాయపడ్డారు. మరి క్రమశిక్షణ సంఘం కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎన్నికలు మున్ముందు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.