మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్లైన్ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీకి దిగడంతో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం చేయాలని పలువురు సీనియర్ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. ‘మా’ కార్యవర్గం పదవీ కాలం పూర్తయినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు లేఖలు రాశారు. ఆగస్టు 22న జరగనున్న జనరల్ బాడీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.