భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాలీవుడ్ సినిమా ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన ఆయన ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ‘న్యూడిల్లీలోని ఉప రాష్ట్రపతి భవనానికి భద్రతగా ఉండే ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులతో కలిసి ‘యూరి’ సినిమాను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది స్ఫూర్తిదాయకమైన చిత్రం. భారత ఆర్మీ విలువను చూపించిన ‘యూరి’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. సినిమా వీక్షిస్తుండగా తీసిన ఫొటోలను షేర్ చేశారు.
‘యూరి’ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు తమ రాష్ట్రంలో పన్ను మినహాయిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. ఇది ప్రజల్లో దేశభక్తిని నింపే చిత్రమని మెచ్చుకున్నారు.
2016లో భారత సైన్యం పాకిస్థాన్‌పై చేపట్టిన మెరుపు దాడుల ఆధారంగా ‘యూరి’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరో పాత్ర పోషించారు. పరేష్ రావల్, రజిత్ కపూర్, యామీ గౌతమ్, కృతి కుల్హారి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. సినిమా దేశవ్యాప్తంగా దాదాపు రూ.170 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
నా కుటుంబసభ్యులు, కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు మరియు ఉపరాష్ట్రపతి నివాసంలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కలిసి “యూరి – ద సర్జికల్ స్ట్రైక్” సినిమాను వీక్షించడం జరిగింది. @ITBP_official #URITheSurgicalStrike pic.twitter.com/IqfJOmE8bs
— VicePresidentOfIndia (@VPSecretariat) January 29, 2019