ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. దాదాపు 300 చిత్రాల్లో 2 వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. గానగంధర్వుడు ఎస్పీ బాలుకు అత్యంత ఆప్తుడు. నెల్లూరులో విద్యాభ్యాసం చేసిన ఆయన ఎస్‌బీఐలో ఉద్యోగం చేశారు. బాల్యం నుంచే తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయన తన 11వ ఏట భక్త దుఃఖనాశ పార్వతీశ అనే మకుటంతో శతకం రాశారు. అలా విద్యార్థి దశలోనే రామచంద్ర శతకం, లలితా శతకం రచించారు. అప్పుడప్పుడూ నాటకాలు కూడా వేసేవారు. నాటకాలు రాసి రచయితగా పేరు తెచ్చుకున్నారు.
ఎప్పటికైనా సినిమాల్లో పాటలు రాయాలని ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ను సినీ గేయ రచయితగా చేసింది. అప్పట్లో నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి శ్రీరామచంద్రుడు సినిమాలో పాట రాసేందుకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ఎస్పీ బాలు ప్రోత్సాహంతో అన్నా చెల్లెలు సినిమాకు ఓ పాట రాశారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగానిక రాజీనామా చేసి సినిమాల్లో స్థిరపడ్డారు. 1988లో మహర్షి సినిమాకు వెన్నెలకంటి రాసిన మాట రాని మౌనమిది కుర్రకారును బాగా ఆకట్టుకుంది. గజినీ సినిమాలో హృదయం ఎక్కడున్నది అనే పాట, స్వాతికిరణం చిత్రంలోని కొండకోనల్లో లోయల్లో.. బృందావనంలోని మధురమే సుధాగానం వంటి ఎన్నోపాటలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి.