ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఎవరెవరిని బరిలోకి దించాలనే దానిపై ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి ఆదరణ ఉన్నప్పటికీ.. కొంతమంది బీజేపీ ఎంపీలపై వ్యతిరేకత ఉండటంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుణె లోక్‌సభ స్థానానికి సంబంధించిన రూపొందించిన జాబితాలో మాధురి పేరు ఉన్నట్లు సీనియర్ బీజేపీ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెను ఎలాగైనా బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ఆమెకు పుణె లోక్‌సభ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. పార్టీ రూపొందించిన తుది జాబితాలో ఆమె పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిపట్టున్న పుణె లోక్‌సభ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అనిల్ షిరోలి ఆ స్థానం నుంచి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌లను చాలా వరకు తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకే బీజేపీ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ముంబయిలోని మాధురి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. సంపర్క్ సమర్థాన్(బీజేపీకి మద్దతివ్వండి)లో భాగంగా షా ఆమెతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అభివృద్ధి గురించి షా ఆమెకు వివరించారు.