కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేస్తోంది. ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న ఈ భయంకరమైన వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెక్కాడితే గాని, డొక్కాడని రోజు కూలీలు రోడ్డున పడ్డారు. చేసేందుకు పనులు లేక, తినడానికి తిండి లేక పస్తులుంటున్నారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులు సైతం కరోనా బాధితులతో నిండిపోవడంతో సామాన్యుడికి వైద్య సేవలు అందటం లేదు. వలస కూలీల పరిస్థితి మరీ దారుణం. పొట్ట నింపుకోవడానికి జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఎక్కడెక్కడికో పిల్లా పాపలతో తరలివెళ్తుంటారు వలస కూలీలు. వీరికి ఆవాసం, ఆహారం అంతా తాత్కాలికమే. పనిచేసిన చోటే ఆహారం తయారుచేసుకుని అక్కడే విశ్రమిస్తారు.
లాక్‌డౌన్ కారణంగా ఇలాంటి వారు ఎన్నో అవస్థలు పడుతున్నారు. తమ పిల్లలు అనారోగ్యంబారిన పడినా వైద్యం చేయించుకోలేని పరిస్థితి. మరోవైపు పోలీసుల దాడులతో అల్లాడుతున్నారు. కూలీలు రోడ్డుపై కనిపిస్తే ఉగ్రవాదుల్లా పోలీసులు రెచ్చిపోయి లాఠీలతో వారి శరీరాలను హూనం చేస్తున్నారు. ఎందరో వలసకూలీలు లాఠీ దెబ్బలు భరించలేక కొన్నిచోట్ల ఎదురు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన దంపతులు మనోహర్, రమణమ్మలు గోరంట్లలోని మాధవరాయ ఆలయం వెనుక ప్రాంతంలో ఒక చిన్న గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారు రోజంతా చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని అమ్మి బ్రతుకు సాగిస్తుంటారు. వారి 11 ఏళ్ల బాలుడు గత శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఓ ప్రైవేటు వైద్యుడికి చూపించారు. మందులు కొనలేక ఆదివారం గోరంట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు
హిందూపురం పంపించారు. అక్కడ 3 రోజులు చికిత్స అనంతరం అనంతపురం లేదా బెంగళూరు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. లాక్‌డౌన్ వల్ల ఆ బిడ్డను తల్లిదండ్రులు ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయారు. పరిస్థితి విషమించి బుధవారం బాలుడు వారి కళ్ళముందే కన్నుమూశాడు. డబ్బులేక కన్నబిడ్డను కాపాడుకోలేక పోయారు ఆ పేద తల్లిదండ్రులు. అష్ట కష్టాలు పడి మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చారు. కరోనా కారణంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అంత్యక్రియలకు డబ్బుల్లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తండ్రి తన బిడ్డను రెండు చేతుల్లో మోసుకుంటూ స్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేశాడు.