దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో ప్రధాని మోడీ లాక్‌డౌన్ పై కీలక ప్రసంగం చేశారు. 550 పాజిటివ్ కేసులు నమోదైన సమయంలో 21 రోజుల లాక్‌డౌన్ ను విధించారు. ఈ 21 రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోయాయి. లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని మోడీ తెలిపారు. మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని ఆయన తెలిపారు.
అయితే, ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 వ తేదీ వరకు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 20 తరువాత కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత సడలింపులు విధించే అవకాశం ఉన్నట్టుగా ఈ సందర్భంగా తెలిపారు. కరోనా హాట్ స్పాట్ లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు.
ఈ లాక్‌డౌన్ వల్ల అనేక మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని.. సైనికుల వలే పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని చాటారన్నారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారిని నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేద్కర్‌కు గొప్ప నివాళి అని వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాధాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.