రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఈ 15 రోజులు పాటు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. ఆ తర్వాత దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేస్తామని తెలిపారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థుల గురించి ఆలోచన చేస్తామన్నారు.
రాష్ట్రంలో 503 కేసులు నమోదయ్యాయని, 14 మంది మరణించారని కేసీఆర్ వెల్లడించారు. 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారని అన్నారు. ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. 1600 మంది క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఎవరికీ సీరియస్గా లేదని చెప్పారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు మినహాయింపు ఉంటుందని చెప్పారు.