తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తరువాత కొన్నిటికి సడలింపులు ఇస్తామని కేంద్రం చెప్పింది. తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు. ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు.
తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇవాళ కొత్తగా మరో 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 21 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని చెప్పారు. తెలంగాణలోని 4 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేసీఆర్ తెలిపారు. మరణాల రేటు జాతీయ స్థాయిలో 3.22 శాతం ఉండగా తెలంగాణలో 2.44 శాతం ఉంది. దేశంలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 254 మందిని పరీక్షిస్తుండగా తెలంగాణలో 375 మందిని పరీక్షిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో లాక్‌డౌన్ నుంచి ఎలాంటి సడలింపులు లేవని, మే 7 వరకు ఏ ప్రాంతం నుంచైనా ప్రజలు తెలంగాణకు రావొద్దని, ప్రస్తుతం ఏ నిబంధనలున్నాయో, ఎలాంటి ఆంక్షలున్నాయో అవన్నీ కొనసాగుతాయని కేసీఆర్ అన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులకు అనుమతి లేదన్నారు. పండుగలకు, ప్రార్థనలకు బయట వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. రెడ్‌జోన్‌లో ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని ఆదేశించారు. అలాగే ఇంటి యజమానులు 3 నెలల పాటు అద్దెలు అడగొద్దని ఆదేశించారు. ఇంటి యజమానులు అద్దెకోసం ఇబ్బంది పెడితే 100 నెంబరుకు డయల్ చేయాలని కేసీఆర్ అన్నారు.
ఈ ఏడాది స్కూళ్లు ఫీజులు ఒక్కపైసా కూడా పెంచొద్దని ఆదేశించారు. నెలవారీ ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలన్నారు. ఇక ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదన్నారు. తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులు పెడితే అనుమతి రద్దు చేస్తామన్నారు. మే నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత కొనసాగుతుందని తెలిపారు. పోలీసులకు, శానిటేషన్ సిబ్బందికి 10 శాతం ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
తెల్ల రేషన్‌కార్డుదారులకు మే నెలలోనూ ప్రతి కార్డుపై వ్యక్తికి 12 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తామన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ. 1500 చొప్పున మే మొదటివారంలోనే ఇస్తామని కేసీఆర్ అన్నారు. ఆసరా పెన్షన్లు యధాతధంగా ఇస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మే 7 తరువాత కూడా పెళ్లిళ్లు వంటివి వేడుకగా జరుపుకొనే అవకాశం లేదు. పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందిపడుతున్నామని వినతులు పంపించారు.. లాక్‌డౌన్ సమయంలో ఏప్రిల్, మే నెలలకు వారు చెల్లించాల్సిన స్థిర చార్జీలు రద్దు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్(టిమ్స్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
130 కోట్ల భారతదేశానికి అన్నం పెట్టగలిగే దేశం ప్రపంచంలో ఏదీ లేదని అందుకే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం వీల్లేదన్నారు. వ్యవసాయ పనులు, దాని అనుబంధ పరిశ్రమలు కొనసాగించాలని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే ఈ రంగాలు నడవాలి, లేదంటే తీవ్రమైన ఆహార సమస్య ఎదురవుతుందని అందుకే రైతులను, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ అన్నారు.