ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ టెక్నీషియన్ మృతి చెందినట్లు తెలుస్తుంది. చెన్నైలోని పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో రెహమాన్ ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్టూడియోలో లైట్లు సరి చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు లైట్ మెన్ కరెంట్ షాక్ తో అక్కడిక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన చాలా తమిళ వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, అధికారికంగా ఈ ప్రమాదానికి సంబంధించి రెహమాన్ తరఫు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పంచతాన్ స్టూడియో నుంచి రెహమాన్ లైవ్ షో లు, కన్ సర్ట్ లు చేస్తుంటారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రెహమాన్ ‘పొన్నియన్ సెల్వన్-2’ తో పాటు తమిళంలో పలు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.