నటీనటులు: నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, అజయ్, నాజర్, రవికిషన్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్
నిర్మాత: రామ్ ఆచంట.. గోపీచంద్ ఆచంట.. అనిల్ సుంకర
దర్శకత్వం: హను రాఘవపూడి
నితిన్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్ ‘లై’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
ఇండియాలో ఉన్న అతి పెద్ద క్రిమినల్ అయిన పద్మనాభం(అర్జున్)ను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తుంటారు. కానీ పద్మనాభం మాత్రం అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాడు. మరోపక్క ఎ.సత్యం(నితిన్) అనే పాతబస్తీకు చెందిన కుర్రాడు అమెరికా వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని చూస్తుంటాడు. అలా అమెరికా వెళ్ళిన సత్యం అక్కడ పధ్మనాభంతో గొడవ పడతాడు. ఆ తరువాత సత్యం జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి..? అసలు పద్మనాభంతో నితిన్ ఎందుకు గొడవ పడతాడు..? చివరకు పద్మనాభంను పోలీసులు అరెస్ట్ చేస్తారా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
ఓ స్టైలిష్ యాక్షన్ కథకు దర్శకుడు త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాగా తెరకెక్కించాడు. అతడు రాసుకున్న కథ, తెరపై ఆవిష్కరించిన విధానం మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా పద్మనాభం-సత్యంల మధ్య సాగే దాగుడుమూతలాట చాలా స్టైలిష్ ఉంటుంది. కథ కంటే కథనం వూపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. హీరో, విలన్ మధ్య వచ్చే స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, మైండ్ గేమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ కొత్తగా ఉంటుంది.
నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేఘా ఆకాష్ తన నటనతో పర్వాలేదనిపించింది. అర్జున్ పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. చాలా బలంగా ఆ పాత్రను రాసుకోవడమే కాకుండా అదే విధంగా తెరపై ఎగ్జిక్యూట్ చేశారు. అర్జున్ కూడా తన పాత్రలో వేరియేషన్స్ బాగా పలికారు. అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు, ప్రేక్షకులకు అర్ధం కానీ రీతిలో డైలాగ్స్ ఉండడం, కామెడీకు స్పేస్ ఉన్నా దర్శకుడు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయడం లోపాలుగా మారాయి.