విశాఖ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్.ఆర్.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్ లీక్ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు.
రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. వందలాది పశువులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రసాయన వాయువు పీల్చి ఎంత మంది ఇళ్లలో ఉండిపోయారో తెలియడంలేదు. వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఆరాతీస్తున్నారు. తలుపులు పగులగొట్టి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రానికి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇద్దరు వృద్ధులు, ఒక చిన్నారి మృతి చెందారు.