‘మన్మథుడు 2’ సినిమా చూసి తెగ నవ్వుకున్నానని అక్కినేని అమల తెలిపారు. ఆమె భర్త, ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా చక్కగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్ చిత్రం. అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.
‘మన్మథుడు 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.5.03 కోట్ల షేర్ సాధించిందని చిత్ర బృందం తెలిపింది. సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3.86 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. వారాంతంలో ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. లక్ష్మి, ఝాన్సి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత, కీర్తి సురేశ్ అతిథి పాత్రల్లో కనిపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది.