అల్లరి, నచ్చావులే, అవును ఇలా రవిబాబు డైరెక్ట్ చేసిన ఏ సినిమా తీసుకున్నా కూడా చాలా భిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. తన తోటి దర్శకుల మాదిరి కమర్షియల్ ఫార్మాట్ ను నమ్ముకోకుండా.. భిన్నమైన సినిమాలు చేయడమే రవిబాబు స్టయిల్. అయితే అతడు తెరకెక్కించిన ‘అవును2′,’లడ్డుబాబు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈసారి మరో వైవిధ్యభరితమైన సినిమా చేయాలనుకున్నాడు. ఒక పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి ‘అదిగో’ అనే వింత టైటిల్ తో సినిమాను మొదలుపెట్టాడు. అప్పట్లో నోట్ల రద్దు సంధర్భంగా ఏటీఎం క్యూలో పంది పిల్లతో కనపడి అందరినీ ఆశ్చర్యపరిచాడు రవిబాబు.
అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని దాదాపు ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా.. ఇంకా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ ఆలస్యానికి ఓ కారణముందని అంటున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉన్నతు సమాచారం. గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు చాలా నెమ్మదిగా సాగుతుండడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమవుతుందని అంటున్నారు. గ్రాఫిక్స్ లో పెర్ఫెక్షన్ కోసం చూడడమే సినిమా ఆలస్యానికి కారణమని, సినిమా విడుదల ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.