టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమాలో సుమారు ఏడు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాశారని సమాచారం. విప్లవ, ప్రేమ గీతాలు రాయడంలో సుద్దాలకు వెన్నతో పెట్టిన విద్య. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని పాటలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా మొదట హాలీవుడ్ సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. ఎన్టీఆర్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ భామలు పేర్లు కొన్ని వినిపించినా చిత్రబృందం నుంచి స్పష్టత రాలేదు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా జులై 30, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.