దేశంలోని ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో గాన కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్యం పట్ల ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లతా మంగేష్కర్ నివాసాన్ని బీఎంసీ అధికారులు శనివారం సీల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ముంబైలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. అందులోనూ వైరస్ యుక్త వయసు వారికన్నా కూడా వృద్ధులకు ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న ప్రభకుంజ్‌లో వయో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో ఆ భవనాన్ని సీల్ చేశారు. కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విషయంపై గాయని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. “భవనాన్ని సీల్ చేసిన విషయాన్ని అధికారులు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేమంతా క్షేమంగా ఉన్నాం. ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం అంతా సురక్షితంగా ఉంది అని చెప్పుకొచ్చారు”.