వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య సంఘటనలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? చూద్దాం..
కథ : లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో ఎన్టీఆర్ పరిస్థితి ఎమిటి అనేదే మిగతా కథ.
నటీనటులు : పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్టీఆర్ గా పి. విజయ్ కుమార్ అనే వ్యక్తిని తీసుకోవడంతోనే వర్మ సగం సక్సెస్ అయ్యాడు. విజయ్ నటన అచ్చు ఎన్టీఆర్ ను తలపించింది. అటు లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన యజ్ఞాశెట్టి జీవించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మిగతా పాత్రల్లో ఇతర నటులు మెప్పించారు.
విశ్లేషణ : ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఎన్టీఆర్, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్
నటీనటులు : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్
సంగీతం : కల్యాణీ మాలిక్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి
ప్లస్ పాయింట్స్ :
కథా కథనాలు
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
చివరిగా : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో వర్మ ఈజ్ బ్యాక్
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)