నందమూరి లక్ష్మి పార్వతి ‘క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్’కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన గుండెలను పిండేసిన విషయాలను తొలిసారిగా బయటపెట్టారు. ఎనిమిది నిమిషాల నిడివిగల లక్ష్మి పార్వతి ఇంటర్వ్యూలో ఇన్ని ఏళ్లుగా తనలో దాగి ఉన్న ఎవరికీ తెలియని అసలైన నిజాల గురించి మాట్లాడారు ఎన్టీఆర్‌తో తన తొలి పరిచయం నుంచి చివరగా
ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు అంశం.. ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడటం వరకు లక్ష్మీ పార్వతి వెల్లడించారు.
చంద్రబాబు తనను ఎలా చెడ్డదానిలా సృష్టించారో వెల్లడించారు. రఘురామయ్య డిగ్రీ కాలేజీలో సంస్కృతం, తెలుగు లెక్చరర్‌గా ఉన్న తనను ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు పిలిచారని తెలిపారు. తనతో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను పిలిచినట్లు వెల్లడించారు. తనను తెలుగులోనూ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను హిందీలో రాయమన్నట్లు తెలిపారు.
లక్ష్మీపార్వతి తన తల్లి పూజ గదిలో ఎన్టీఆర్ ఫొటో చూపించి ఆయన మన దేవుడు అని చెప్పారని, అది తన గుండెల్లో అప్పుడే అలా నాటుకుపోయిందని తెలిపారు. అందుకే ఎన్టీఆర్‌ను లోకమంతా అన్నా అని పిలిచినా తాను మాత్రం స్వామీ అని పిలిచినట్లు తెలిపారు.
1989లో ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నాచారం స్టూడియోలో ఉండగా తాను వెళ్లి కలిసినట్లు చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను పస్తులు ఉన్నానని కనీసం మంచినీళ్లు కూడా లేకుండా ఆయన కోసం ఎదురు చూశానని లక్ష్మీపార్వతి తెలిపారు. అప్పుడు ఆయనను చూడగానే చాలా భారంగా ఉన్నారని, ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలిపారు. అప్పుడు ఓడిపోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్‌ను ఓదార్చేందుకు తాను చెప్పిన మాట ఎంతో నచ్చిందని, దాంతో ఆయన చాలా రిలాక్స్ అయ్యారని ఆమె తెలిపారు.
1993 సెప్టెంబర్ 11న ఎన్టీఆర్‌తో తన వివాహం జరిగిందని. మేజర్ చంద్రకాంత్ సినిమా విజయోత్సవ సభలో లక్షలాది జనం ముందు తనను వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ వెల్లడించారని లక్ష్మీపార్వతి తెలిపారు. అలా ప్రకటించిన వెంటనే మైక్, లైట్స్ అన్నీ ఆపేశారని నానా రభస చేశారని తెలిపారు. ఆ మర్నాడు మీడియా ముందు తనను పెళ్లి చేసుకున్నారని వెల్లడించారు. తనపైన మీడియాలో పిచ్చి రాతలు రాయించారని, రజనీకాంత్‌తో కూడా తనపై నిందలు వేయించారని అన్నారు.
1996 ఆగస్ట్ సంక్షోభం నుంచి ఎన్టీఆర్ మానసికంగా ఎంతో కుంగిపోయారని తెలిపారు. తప్పు చేస్తే తన భార్యనైనా రోడ్డుపై శిక్షిస్తానని ఎన్టీఆర్ చెప్పారని, ఏ తప్పూ చేయని ఆయన భార్యపై ఎన్నో అభాండాలు వేశారని, ఆఖరి నిమిషం వరకు తన భార్యను ఆ అవమానాలనుంచి కాపాడుకోవడానికి ఎన్టీఆర్ ఎన్నో అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన స్త్రీని తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని, కానీ తన గుండెను తాను కాపాడుకోలేకపోయారని లక్ష్మీ పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. విజయవాడలో జరిగిన సింహగర్జన సభ నుంచి జరిగిన కుట్ర బయటకు వస్తే చంద్రబాబును ప్రజలు ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం అంతా కలిసి తన భర్తను హత్యచేశారని లక్ష్మీపార్వతి అన్నారు. ఇంకా ఎన్టీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసిన కుట్రదారుల పేర్లు వెల్లడించారు.