2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ప్లాష్ సర్వే అభిప్రాయపడింది. జగన్ పార్టీకి ఏడు స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని, జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూ ఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు సైకిల్ ఎక్కారంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి ముందే ట్రైలర్ వదిలిన లగడపాటి.. గెలుపు టీడీపీదేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. టీడీపీకి ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్‌సభ స్థానాలపై మాట్లాడుతూ..టీడీపీకి 15 సీట్లకు రెండు అటుఇటుగా, వైసీపీకి 10కి రెండు అటుఇటుగా స్థానాలు రావొచ్చని లగడపాటి అంచనావేశారు. జనసేన, ఇతరులకు సున్నా నుంచి ఒక లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టు తమ సర్వేలో తేలిందన్నారు.
జనవరి నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏంటనే ఆర్జీ ప్లాష్ టీం నెలనెలా అంచనా వేసిందని లగడపాటి తెలిపారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించిన సర్వే ఇదని లగడపాటి చెప్పారు. తాను ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూడలేదని, కేవలం అంచనాలేనని లగడపాటి తెలిపారు. మరోసారి టీడీపీ గెలవాలని ప్రజలు భావించారన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. త్రిముఖ పోరులో టీడీపీ, వైఎస్ఆర్సీపీకి 2014 కంటే ఓట్ల శాతం తగ్గిందన్నారు.