Homeతెలుగు Newsలగడపాటి రాజకీయ జోకర్‌: హరీష్‌రావు

లగడపాటి రాజకీయ జోకర్‌: హరీష్‌రావు

2 4హైదరాబాద్‌ నగర శివారు గండిపేట మండలం మణికొండలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికలపై ప్రకటిస్తున్న సర్వేలు ఒకలా ఉంటే లగడపాటి సర్వేలు మాత్రం మరోలా ఉందన్నారు. ఎన్నికల సర్వేలు అంటూ రహస్య ఎజెండా ప్రకారం పనిచేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎన్నికల తరువాత రాజకీయ జోకర్‌గా మిగిలిపోవడం ఖాయమని ఆయన అన్నారు. మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఎన్నికల తరువాత శాశ్వత సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున 20మంది వరకు ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థులు గెలుపు కోసం వారి నియోజకవర్గాల్లో తిప్పలు తప్పడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిశబ్ధ విప్లవం కొనసాగుతుందని, ఈనెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు అది బయట పడుతుందన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి పథకాలను అందించిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు మార్చాలనుకుంటారో రాజకీయ పండితులు ఆలోచన చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ చేయలేని చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో వచ్చి గొప్పలు చెప్పకుంటున్నారని హరీష్‌రావు విమర్శించారు. వీలైతే తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, షీటీమ్, పరిశ్రమ స్థాపన, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలు ఏపీలో కొనసాగించాలని చంద్రబాబుకు సూచించారు. వాటితోనైనా ఆంధ్రప్రజలు సంతోషపడతారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తక్కువ సమయంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే అనేక మీడియా, ఇతర సంస్థల అవార్డులు అందుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో తమపై చేస్తున్న విమర్శలకు రాజకీయంగా ఎదుర్కొంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజలను కించపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వం, పార్టీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రకాశ్‌గౌడ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పదేళ్లుగా కృషిచేశానన్నారు. ఇప్పటి వరకు అత్యధిక కాలం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో కొన్ని పనులు చేయలేకపోయానని, వాటిని రాబోయే రోజుల్లో పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందుతానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి మల్లేశ్, కార్పొరేటర్‌ విజయ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి. చంద్రశేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పత్తి ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu