ప్రముఖ దివంగత నటుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ – ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో వైభవంగా జరుగుతూ వచ్చాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన పేరుపై ప్రముఖ నటి .. నర్తకి ఎల్. విజయలక్ష్మి కి పురస్కారాన్ని అందజేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు. ఆ ప్రకారమే నిన్న జరిగిన వేడుకలో ఎన్టీఆర్ శతాబ్ది అవార్డుతో పాటు బంగారు పతాకాన్ని ఆమెకి బాలయ్య అందజేశారు. సినిమాల తరువాత కూడా విజయలక్ష్మి గారి ప్రయాణం ఆగిపోలేదనీ, ఇప్పటికీ డాన్సులలో కొత్త పోకడలను ఆమె ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారని బాలయ్య అన్నారు.
నిత్య విద్యార్థినిలా నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమెకి ఈ అవార్డును అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా పరిశ్రమకి సంబంధించి పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో ఎల్. విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎన్టీఆర్ మహానటుడనీ .. క్రమశిక్షణకు ఆయన మారుపేరు అనీ .. అలాంటి ఒక మహా వ్యక్తి అవార్డుతో తనని సత్కరించడం తన అదృష్టమంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఎల్. విజయలక్ష్మికి చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఇష్టం. భరతనాట్యం నేర్చుకోవడం కోసమే అప్పట్లో ఆమె పూణె నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఆమె మంచి పొడగరి .. సౌందర్యవతి కావడంతో సినిమాల్లోను అవకాశాలు వచ్చాయి. 60వ దశకంలో ఎన్టీఆర్ చేసిన ‘జగదేకవీరుని కథ’ సినిమాతోనే ఆమె నట జీవితం మొదలైంది. ఆ తరువాత కాలంలో ఆమె నాట్యం లేని సినిమా ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆమె, ఎన్టీఆర్ శతాబ్ది అవార్డును అందుకోవడం కోసమే అక్కడి నుంచి రావడం విశేషం.