శాసనసభ ఉపఎన్నికల్లో భాగంగా మండ్యలో ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మండ్య లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన తన కుమారుడిని ఓడించి అక్కడి ప్రజలు తనను విడిచిపెట్టారని కంటతడి పెట్టుకున్నారు. కేఆర్ పేట ఉపఎన్నిక సందర్భంగా ఆ స్థానం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేస్తున్న బీఎల్ దేవరాజ్ తరపున బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ ఎంతో నమ్మకం ఉంచిన మండ్య ప్రజలు నా కుమారుడిని ఓడించి నన్ను వదిలిపెట్టారు. నా కుమారుడు నిఖిల్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నేను అనుకోలేదు.. కానీ మీరు పట్టుబట్టడం వల్లే నిలబెట్టాను. నేనేం తప్పు చేశానని ఓడించారు. అయినా నా బాధంతా ఓడిపోయిన నా కుమారుడి గురించి కాదు..ఇక్కడి ప్రజల గురించే. సీఎం పదవి కన్నా మీ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ ఏడాది జులైలో కర్ణాటక శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో 17 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అధికారాన్ని కోల్పోయింది. అనంతరం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయా స్థానాలు ఖాళీ అవడంతో ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత అనర్హులుగా ప్రకటించిన వారికి కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.