KTR about Singareni Coal Mines Auction: సింగరేణి బొగ్గు గనుల వేలం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బొగ్గు గనుల వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సాహసం కూడా చేయలేదని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి కలిసిపోయి తెలంగాణ సంపదను దోచిపెడుతున్నారని కేటీఆర్ కామెంట్లు చేశారు.
“తప్పకుండా మళ్ళీ నాలుగున్నర ఏళ్ల తర్వాత మా గవర్నమెంటే వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు వచ్చి బొగ్గు గని వేలంలో పాల్గొనద్దు. నేను మీకు ముందే చెబుతున్నాను. తర్వాత మమ్మల్ని తప్పు పట్టదు. 2028లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. వచ్చిన తర్వాత 100% ఈ నిర్ణయానికి అడ్డుకట్ట వేస్తాము. ఎవరైతే ఇప్పుడు వేలంపాటలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలని నేను చెబుతున్నాను. తర్వాత మమ్మల్ని ప్రశ్నించవద్దు అది మేము కొనుక్కున్న గని, మేము తవ్వుకుంటాము అని చెప్పద్దు. తెలంగాణ ప్రజల తరపున, సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి అభివృద్ధి దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము. వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. మళ్లీ మేము పవర్ లోకి వచ్చాక కచ్చితంగా ఈ నిర్ణయానికి అడ్డుకట్ట వేస్తాము. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. సింగరేణికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను”అని చెప్పుకొచ్చారు కేటీఆర్.
“గతంలో బొగ్గు గనుల వేలం పెట్టొద్దని రేవంత్ రెడ్డి స్వయంగా మోడీకి లేఖ రాశారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రాజీ పడుతున్నారు? కేసులకు భయపడుతున్నారా” అని ప్రశ్నించారు కేటీఆర్. “కేంద్ర మంత్రి అయ్యాక ఎవరైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తారు. కానీ కిషన్ రెడ్డి ఉన్న గనులను అమ్ముతున్నారు” అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఒడిశాలో వేలం లేకుండా గనులను నైవేలీ లిగ్నెట్‌కు ఇచ్చారని, గుజరాత్‌లో గనులను కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించారని చెప్పారు కేటీఆర్. ఆఖరికి తమిళనాడులో కూడా ప్రభుత్వరంగ సంస్థకు బొగ్గు గనులు ఇచ్చారని, మరి సింగరేణికి మాత్రం వేలం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.