ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకంటూ రాష్ట్రంలో ఒక గుర్తింపు, రాజకీయంగా ఉనికి లభించిందంటే దానికి సిరిసిల్ల ప్రజలే కారణమన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా సిరిసిల్ల చేరుకున్న కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్టాడారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించుకున్నామని, తాగునీటి సమస్యను 95 శాతం పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. వేసవిలోపు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న సీఎం కేసీఆర్ తపనకు అనుగుణంగా కృషి చేస్తామని వివరించారు. రాబోయే ఆరునెలల్లో ఎల్లారెడ్డి పేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనరావుపేటతో పాటు సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. సిరిసిల్ల జిల్లాలో మెట్ట ప్రాంతం రైతాంగం మొత్తం సీఎం కేసీఆర్ పేరును తరతరాలుగా గుర్తు పెట్టుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేటీఆర్ అన్నారు. దేశంలో అతిచిన్న వయస్సు కలిగిన రాష్ట్రం తెలంగాణ చేసినప్పుడు మనమెందుకు చేయకూడదనే ఆలోచన ఇతర రాష్ట్రాల్లో మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ మాదిరిగా సంక్షేమ ఫలాలు అందాలనేది కేసీఆర్ ఆలోచన అని.. అందుకే గుణాత్మక మార్పు దిశగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పారు. తనకు జన్మనిచ్చింది కన్నతల్లే అయినా.. రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల ప్రజలని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజల అండ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తూనే.. మరొకవైపు సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు రాబోయే మూడేళ్లలో సిరిసిల్లలో రైలుకూత పెట్టిస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నేతన్నలకు చేయాల్సింది చాలా ఉందని.. కార్మికున్ని యజమాని చేసే దిశగా కార్యక్రమాలు చేపడతామన్నారు. బీడీ కార్మికులకు నైపుణ్య శిక్షణ నిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.