ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకే విధులు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు. రాత్రి 8 గంటల్లోపు మహిళలు ఇంట్లో ఉండాలని సీఎం పేర్కొనడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేఖాశర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా? అని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్విటర్‌లో అభ్యంతరం తెలిపారు. కీలక స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించాలని.. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని రేఖాశర్మకు సూచించారు. సీఎం కేసీఆర్ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు.